ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 3:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.

సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.

అధికారులకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశాలు.. పారిశుద్ధ్య లోపాలపై అసహనం.

అర్జున్ సమాచారం // సిద్దిపేట: డెస్క్ అక్టోబరు 14.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సద్దుల బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు, ఎర్రచెరువు, మచ్చవానికుంట, నర్సాపురం చెరువు, రంగదాంపల్లి చెరువుల వద్ద సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పండుగ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.

కోమటి చెరువు వద్ద పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన అధికారులు, పర్యాటక శాఖ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర పండుగ నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు.

సద్దుల బతుకమ్మ పండుగ నాటికి కోమటి చెరువుతోపాటు అన్ని చెరువుల పరిసరాల్లో పూర్తిస్థాయి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు, మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సూచించారు. పర్యాటక, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కోమటి చెరువు వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ పర్యటనలో మున్సిపల్ డీఈ ప్రేరణ, సంబంధిత సిబ్బంది, పోలీసు అధికారులు, స్థానిక వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.